Dis Advantage of Energy Drinks, why don't take energy drinks, Energy Drinks are harmfull to health


సత్వరం శక్తినిచ్చే పానీయాలంటే చాలామంది ఇష్టపడుతుంటారు. రకరకాల రంగుల్లో ఆకర్షణీయంగా కనిపించే వీటిల్లో చక్కెరతో పాటు కెఫీన్‌ కూడా ఎక్కువగానే ఉంటుంది. అందువల్ల వీటిని తాగినవెంటనే తాత్కాలికంగా హుషారుగా అనిపిస్తుంది. కానీ వీటితో మంచి కన్నా కీడే ఎక్కువని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఇవి రక్తపోటు పెరగటానికే కాదు.. గుండెలయ దెబ్బతీయటానికీ దోహదం చేస్తున్నట్టు అమెరికన్‌ హార్ట్‌ అసోసియేషన్‌ అధ్యయనంలో తేలింది. శక్తినిచ్చే పానీయాలపై గతంలో చేసిన ఏడు అధ్యయనాలను క్రోడీకరించి గుండె ఆరోగ్యంపై ఇవి చూపే ప్రభావాలను నిర్ధరించారు. కేవలం ఒకటి నుంచి మూడు డబ్బాల శక్తి పానీయాలు తాగినా ఇవి తీవ్ర ప్రభావం చూపుతున్నట్టు వెల్లడైంది. వీరి గుండెను ఈసీజీ తీయగా.. అందులో క్యూ, టీ బిందువుల మధ్య విరామం 10 మిల్లీసెకండ్ల మేరకు ఎక్కువగా ఉంటున్నట్టు గుర్తించారు. ఈ బిందువుల మధ్య విరామం పెరగటమనేది గుండెలయ దెబ్బతినటాన్ని సూచిస్తుండటం గమనార్హం. అలాగే శక్తినిచ్చే పానీయాలు తాగినవారి సిస్టాలిక్‌ రక్తపోటు (పై సంఖ్య) కూడా సగటున 3.5 పాయింట్లు పెరుగుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. కాబట్టి అధిక రక్తపోటు లేదా క్యూటీ సిండ్రోమ్‌ గలవారు శక్తి పానీయాలను తీసుకునేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలని సూచిస్తున్నారు. శక్తినిచ్చే పానీయాల్లో కెఫీన్‌ మూలంగా వీటికి అలవాటుపడే ప్రమాదమూ ఉంది. దీంతో వీటిని తాగకపోతే కొన్నిసార్లు తలనొప్పి, అలసట, చిరాకు వంటి లక్షణాలు కనిపించొచ్చు. ఇవి మన శరీరంలోని సోడియం, పొటాషియం వంటి ఎలక్ట్రోలైట్ల స్థాయుల్లో అసాధారణ మార్పులు కలగజేస్తాయి. కాబట్టి తల్లిదండ్రులు తమ పిల్లలను వీటికి దూరంగా ఉండేలా చూడటం మేలని నిపుణులు సూచిస్తున్నారు. శక్తి పానీయాలు నీటికి ప్రత్యామ్నాయం కాదనీ గుర్తుంచుకోవాలి. పైగా వీటిల్లోని కెఫీన్‌ ఒంట్లోంచి నీటిని ఎక్కువగా బయటకు పంపిస్తుంది కూడా. కాబట్టి దాహం వేసినప్పుడు ఇలాంటి శక్తినిచ్చే పానీయాల కన్నా నీళ్లు తాగటమే మేలు.