Google Realse Diabetic contact lense, Latest Contact lense from google


ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కోట్లాదిమంది మధుమేహ రోగులకు శుభవార్త. మన కన్నీళ్లలో దాగి ఉండే గ్లూకోజ్ స్థాయిలను ఒడిసిపట్టి తేల్చి చెప్పే సరికొత్త కాంటాక్ట్‌ లెన్స్‌ను గూగుల్ ఆవిష్కరించింది. ఈ గూగుల్ లెన్స్ భవిష్యత్తులో షుగర్ రోగులకు ఎంత మేలు చేయనుందంటే రోజుకు కనీసం స్వంత రక్తాన్ని వేలినుంచి పది సార్లు తీసి పరీక్షించుకోవలసిన బాధనుంచి కోట్లాదిమంది డయాబెటిక్ రోగులకు త్వరలో ఉపశమనం కలుగనుంది. ప్రస్తుతం నమునా దశలో ఉన్న ఈ ఆవిష్కరణ వాస్తవ రూపం దాల్చడానికి మరో అయిదేళ్లు పట్టవచ్చని ప్రపంచ నంబర్ వన్ ఐటీ సంస్థ గూగుల్ పేర్కొంది.

సాంప్రదాయికంగా చేతి వేళ్లను సూదితో పొడిచి రక్తం తీసి పరీక్షించే సాంప్రదాయిక సంక్లిష్ట పద్ధతిని గూగుల్ కాంటాక్ట్ లెన్స్ మటుమాయం చేయనుంది. మధుమేహ రోగులలో ఉండే గ్లూకోజ్ స్థాయిని తనిఖీ చేయడానికి పలు కంపెనీలు ఇప్పటికే అనేక వైద్య పరికరాలను రూపొందిస్తున్నాయి. దీంట్లో భాగంగా గూగుల్ డయాబెటిక్ కాంటాక్ట్ లెన్స్‌ తయారీపై దృష్టి పెట్టింది. ఈ ప్రత్యేక లెన్సులు సూక్ష్మమైను గ్లూకోజ్ సెన్సర్‌ను, వైర్‌లెస్ ట్రాన్స్‌మిటర్‌ను ఉపయోగించి కంటిలోపలి గ్లూకోజ్ స్థాయిలను తనిఖీ చేస్తాయి. బ్లడ్ షుగర్‌ను తనిఖీ చేసి దానికనుగుణంగా ఔషధాల డోసును సవరించుకోవలసిన అవసరమున్న 38 కోట్లమంది ప్రపంచ మధుమేహ రోగులకు ఇది సంజీవనిలా ఉపయోగపడనుంది. 
గత 18 నెలలుగా గుర్తు తెలియని గూగుల్ ల్యాబ్‌లో ఈ ప్రత్యేకమైన కాంటాక్ట్ లెన్సు‌లను అభివృద్ధి చే్స్తున్నట్లు గూగుల్ పరిశోధక బృందం అధిపతులలో ఒకరైన బైరన్ ఓటిస్ పేర్కొన్నారు. ఈ ల్యాబ్‌లోనే డ్రైవర్ లేని కారు, గూగుల్ ఐ గ్లాస్, వైర్ లెస్ స్థలాల్లో కూడా ఇంటర్నెట్ పనిచేసేలా చేసే అతి పెద్ద బెలూన్ల నెట్ వర్క్ అయిన ప్రాజెక్టు లూన్ వంటి పలు ఆవిష్కరణలను ఈ రహస్య ల్యాబ్‌లోనే రూపొందిస్తున్నారు. 
సృజనాత్మక శాస్త్రజ్ఞులు మధుమేహ రోగులకోసం పరిష్కారాల దిశగా పరిశోధించడం పట్ల అమెరికా డయాబెటిస్ అసోసియేషన్ బోర్డ్ చైర్మన్ డ్వైట్ హోలింగ్ కృతజ్ఞతలు తెలిపారు. అయితే గూగుల్ కాంటాక్ట్ లెన్స్ ఖచ్చితమైన సమాచారాన్ని సకాలంలో అందించవలసి ఉంటుందని హెచ్చరించారు. 
పరిశోధక బృంద నేత ఓటిస్ ఈ అరుదైన పరికరాన్ని చూపించినప్పుడు అది మామూలు కాంటాక్ట్ లెన్స్‌లాగానే కనిపించింది కాని నిశిత పరిశీలనలో వేలాది అతి సూక్ష్మ ట్రాన్సిస్టర్లు ఈ లెన్సులో ఉన్నట్లు తేలింది. పైగా తలవెంట్రుక కంటే సన్నని యాంటెన్నా కూడా దీనిలో అమర్చినట్లు బయటపడింది. ప్రతి ఉత్పత్తినీ అత్యంత సూక్ష్మ స్థాయికి తీసుకురావాలనే అద్భుతమైన కృషిలో భాగంగా ఇది రూపొందిందని ఓటిస్ స్వయంగా తెలిపారు. ఎలెక్ట్రానిక్స్‌ను సూక్ష్మీకరించడానికి వెంట్రుక సైజులోని తీగలను కలపడానికే సంవత్సరాల సమయం పట్టింది. శిథిలాల నుంచి పలుచని చిప్‌లను నిర్మించడం అనే ఈ ప్రక్రియలోనే వైద్య చరిత్రలో అతి చిన్న వైర్‌లెస్ గ్లూకోస్ సెన్సర్‌ను తాము కనిపెట్టామని చెప్పారు. 
అయితే ఇలాంటి సూక్ష్మాతిసూక్ష్మ కాంటాక్ట్ లెన్స్‌ల తయారీలో ఇప్పటికే అనేక సంస్థలు నిమగ్నమై ఉన్నాయని వీటిలో ఏది మొదట, సమర్థంగా పనిచేస్తుందన్నదే మార్కెట్‌లో కీలకాంశమవుతుందని నొవియోసెన్స్ సంస్థ సీఈఓ డాక్టర్ క్రిస్టోపర్ విల్సన్ చెప్పారు. నెదర్లాండ్స్‌కు చెందిన నొవియోసెన్స్, ఇజ్రాయెల్‌కు చెందిన ఒర్‌సెన్స్ కూడా ఇలాంటి డయాబెటిక్ కాంటాక్ట్ లెన్స్‌ తయారీలో నిమగ్నమయ్యాయి.మా మోనిటర్ల నుంచి మేం పొందుతున్న డేటా ఆధారంగా మధుమేహ రోగులు అత్యంత కీలకమైన ఆరోగ్య నిర్ణయాలు తీసుకుంటున్నారని అమెరికా డయాబెటిస్ అసోసియేషన్ బోర్డ్ చైర్మన్ డ్వైట్ హోలింగ్ పేర్కొన్నారు. 
గూగుల్ సంస్థ సృజనాత్మకతకు మారుపేరు, నూతన సాంకేతిక ఆవిష్కరణలలో వారు ముందున్నారు, కాని నిజాయితీగా చెప్పాలంటే డబ్బే మార్కెట్లో చోదకశక్తి అని పేలో అల్టో మెడికల్ ఫౌండేషన్ ఎండాక్రినాలజిస్ట్ డాక్టర్ లారీ లెవిన్ వ్యాఖ్యానించారు. ఏదేమైనా గూగుల్ వంటి పక్కా సాంకేతిక సంస్థ వైద్యరంగంలోకి అడుగుపెట్టడం గుర్తించదగిన పరిణామమని కొనియాడారు. 
సాధారణ రోగుల విషయం మాటేమో కాని సంవత్సరాల తరబడి ప్రతి రోజూ లేదా వారం వారం చేతికి సూది పొడిపించుకుని రక్తమిస్తూ విసుగెత్తిపోయిన మధుమేహ రోగులకు సూదితో పొడన నవసరం లేని వైద్యవిధానం ఒకటి ఉనికిలోకి వస్తోందన్న వార్త మహదానందాన్ని కలిగిస్తుందనడంలో సందేహమే లేదు.