Indian Tradition with Gold Ornaments, Why womens like gold ornaments

 
why Gold Marketwhy Gold Market
భారతీయులు సంప్రదాయంగా బంగారాన్ని ఐశ్వర్యానికి, సంపదకు నిదర్శనంగా భావిస్తుంటారు. ప్రత్యేకించి భారతీయ అతివలు బంగారు ఆభరణాలంటే ప్రాణం పెట్టుకుంటారు. కానీ ఈ ధోరణి భారత్‌కు మాత్రమే పరిమితం కాలేదు. డాలర్‌పై రూపాయి విలువ పతనం... పసిడి దిగుమతులపై ప్రభుత్వ ఆంక్షలు... ఆకాశాన్నంటే స్థాయిలో ద్రవ్యోల్బణం పైపైకి దూసుకెళ్లడం తదితర కారణాల వల్ల గతేడాది పసిడి పట్ల భారతీయుల డిమాండ్ భారీగా 15 - 17 శాతం పడిపోయిందని జ్యువెలరీ రిటైల్ వ్యాపారులు పేర్కొంటున్నారు.
పండుగలు, వివాహాలు... ఇతర శుభకార్యాల సమయంలో ప్రతి ఇల్లాలూ ఎంతోకొంత బంగారం సొంతం చేసుకోవాలని ఉబలాట పడుతుంది. కానీ పెరిగిన ధరల రీత్యా షాపులకెళ్లి కొత్త ఆభరణాలు కొనుగోలు చేయడానికి అతివలు ఆసక్తి చూపట్లేదు. పాత బంగారం కొనుగోలు చేసి, మహిళలువాటికే మెరుగులు దిద్దుకుంటున్నారని గీతాంజలి ఎక్స్ పోర్ట్ కార్పొరేషన్ సిఇఓ సంజీవ్ అగర్వాల్ పేర్కొంటున్నారు. ఇప్పటి వరకూ ప్రపంచంలోకెల్లా అతిపెద్ద పసిడి వినియోగ దేశంగా ఉన్న భారత్‌ను చైనా అధిగమించేసింది.విక్రయాలు పడిపోవడంతో వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యుజిసి) కూడా అంచనాలను సవరించుకోవాల్సి వచ్చిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. గతేడాది భారత్‌లో 864 టన్నుల బంగారం కొనుగోళ్లు జరిగాయి. ఈ ఏడాది 1000 టన్నుల పసిడి కొనుగోళ్లు జరుగుతాయని అంచనా వేసిన వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యుజిసి) దాన్ని 900 టన్నులకు సవరించింది.కొనుగోళ్లు తగ్గిపోవడంతో జ్యువెలరీ సంస్థలు కూడా ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నాయి. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా చౌక ధరకు వ్రజాలు ఆఫర్ చేస్తున్నాయి జ్యువెలరీ సంస్థలు. ఈ ఏడాది డిసెంబర్ నెలాఖరుతో ముగిసిన త్రైమాసికం నాటికి బారత్ లో 714.7 టన్నుల బంగారం కొనుగోళ్లు మాత్రమే జరిగాయి. పొరుగు దేశమైన చైనా కొనుగోళ్లు 779.6 టన్నులకు చేరుకున్నాయి.వివాహాల సీజన్ పక్కన బెడితే దసరా, దీపావళి, ధన త్రయోదశి, క్రిస్మస్ పండుగల సీజన్‌లో పసిడి కొనుగోళ్లు భారీగా జరుగుతాయి. కానీ ఈ ఏడాది ఆ స్థాయిలోనే కొనుగోళ్లు లేవు. సెప్టెంబర్ నెలతో ముగిసిన త్రైమాసికంలో బంగారు ఆభరణాల కొనుగోళ్లు కేవలం 148 టన్నులే. ఇది 2012తో పోలిస్తే 32 శాతం తక్కువ అని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ భారత్ ఎండి పిఆర్ సోమ సుందరం పేర్కొన్నారు.విక్రయాలపై ఆశలు వదులుకోవడం ఇష్టం లేని రిటైల్ వ్యాపారులు... పసిడి క్రయ విక్రయాల్లో ఒడిదుడుకులు సహజమేనని కీర్తిలాల్ ప్రతినిధి శాంతాకుమార్ పేర్కొన్నారు. పసిడి వినియోగ దారుల్లో ఆసక్తి పెంచేందుకు ఐపాడ్ అప్లికేషన్ ద్వారా సృజనాత్మక ఆభరణాల డిజైన్లు అందుబాటులోకి తెచ్చామని శాంతా కుమార్ తెలిపారు.ఆన్‌లైన్‌లో సృజనాత్మక పద్దతుల్లో జిఆర్ టి, తనిష్క్, పిసి జ్యువెలర్స్. కల్యాణ్ జ్యువెలర్స్ వంటి సంస్థలు సరికొత్త డిజైన్ల విక్రయాల్లో దూకుడుగా ముందుకెళుతున్నాయి. హంకాంగ్ లో పని చేస్తే ఓ వ్యక్తి తన భార్యకు నక్షత్ర డిజైన్ ఆభరణల కోసం ఆన్‌లైన్‌లో ఆర్డర్ బుక్ చేశాడని జ్యువెలరీ వ్యాపారి అగర్వాల్ తెలిపారు.ఇప్పుడిప్పుడే విస్తృతమవుతున్న ఆన్‌లైన్ వ్యాపారానికే భవిష్యత్‌ ఉంటుందని విశ్వసిస్తున్నారు కీర్తిలాల్ శాంతా కుమార్. అధిక ధరలపై కొత్త మోడల్ ఆభరణాల కొనుగోలు కంటే ఆఫర్లతో కూడిన సాధారణ ఆభరణాలకు వినియోగ దారులు ప్రాధాన్యతనిస్తున్నారంటారు శాంతా కుమార్. 2012 - 13 ఆర్థిక సంవత్సరంలో కరంట్ ఖాతా లోటు రికార్డు స్థాయిలో 88.2 బిలియన్ డాలర్ల (జిడిపిలో 4.8శాతం)కు చేరుకోవడం వల్లే పసిడి డిమాండ్ పడిపోవడానికి మరో కారణం.ఈ నేపథ్యంలో భారీగా దిగుమతి చేసుకుంటున్న పసిడి, చమురులతోపాటు ఎగుమతులు తగ్గిపోవడానికి కారణాలను విశ్లేషించిన కేంద్రం... పసిడి దిగుమతిపై ఆంక్షలు విధించింది. బంగారు నాణాల దిగుమతిపై పూర్తి స్థాయిలో ఆంక్షలు విధించింది. పసిడి, ఆర్నమెంట్ బంగారం దిగుమతిపైనా సుంకాన్ని ఆరు శాతం నుంచి 10 శాతానికి పెంచడంతో ఒక్కసారిగా డిమాండ్ పడిపోయింది.పసిడి దిగుమతిపై ఆంక్షలు కరంట్ ఖాతా లోటు తగ్గుముఖం పడుతుందనడంలో్ ఎటువంటి సందేహం లేదని జోస్ అలుక్కాస్ ఎండి జాన్ అలుక్కా పేర్కొన్నారు. అయితే ఆంక్షల వల్ల సంఘటిత రంగంలోని రిటైల్ వ్యాపారులకు ముడి పసిడి కొరత ఏర్పడుతుందని జాన్ అలుక్కా తెలిపారు. పసిడి దిగుమతులు పడిపోవడం వల్ల రూపాయి విలువ బలోపేతం అవుతుందని అందులో అనుమానమే లేదని సోమసుందరం చెప్పారు.ఇతర దేశాలతో పోలిస్తే భారత్ లో పసిడి కొనుగోలుకు 20 శాతానికి పైగా అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోందని రిటైలర్లు పేర్కొంటున్నారు. దిగుమతి సుంకం భారీగా ఉండడంతో కొనుగోలు దారులు సింగపూర్, థాయిలాండ్, దుబాయ్ నుంచి కొనుగోలు చేస్తే చౌక ధరలకు లభిస్తుందని గీతాంజలీ జ్యువెలరీస్ వ్యాపారి అగర్వాల్ తెలిపారు. దిగుమతి సుంకం 15 శాతానికి పెరిగినా ఈ దేశాల నుంచి తెచ్చుకుంటే చౌకధరకే లభిస్తుందని అగర్వాల్ వ్యాఖ్యానించారు.పసిడి, వెండి దిగుమతిపై ఆంక్షలు కఠినతరం చేయడంతో డిసెంబర్ నెలాఖరు నాటికి వాటి దిగుమతులు 68.8 శాతం (1.77 బిలియన్ డాలర్లు) తగ్గాయి. గతేడాది పసిడి, వెండి దిగుమతులు విలువ 5.6 బిలియన్ డాలర్లు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఎనిమిది నెలల కాలంలో పసిడి ఆభరణాల దిగుమతులు 93 శాతం తగ్గాయి.గతేడాది తొలి ఎనిమిది నెలల కాలంలో రూ.22,989 కోట్ల విలువైన పసిడి, వెండి ఆభరణాలు దిగుమతి చేసుకుంటే... ఈ ఏడాది అది రూ.1521 కోట్లకే పరిమితమైందని అఖిల భారత వజ్రాలు, పసిడి ఆభరణాల ఎగుమతుల ప్రోత్సాహక మండలి పేర్కొంది. దిగుమతులు తగ్గుముఖం, ఎగుమతుల్లో వృద్ధి వల్ల కరంట్ ఖాతా లోటు వచ్చే మార్చి నాటికి 50 బిలియన్ డాలర్లకు పరిమితమవుతుందని కేంద్రం, జ్యువెలరీ వ్యాపారులు అంచనా వేస్తున్నారు.