Fashion Technology Indtroducing varity Make up kits, Chip Make-up Kits, Varity Beauty Products


గతంలో సబ్బుల తయారీలో పంది కొవ్వు, లిప్‌స్టిక్‌ తయారీలో చేప పొలుసులు ఉపయోగిస్తారని తెలుసుకుని ఆశ్చర్యపోయాం. ఇప్పుడు ఇంతకంటే ఆశ్చర్యపరిచే సౌందర్య పోషక వస్తువులను కనిపెట్టారు పరిశోధకులు. 
తెల్లని చర్మం కోసం నల్లని బొగ్గు బొగ్గు చేతికి అంటుకుంటే ఆ నల్లని మరక వదిలేవరకూ సబ్బుతో రుద్దుతాం. కానీ ఇప్పుడిదే బొగ్గు చర్మంపైనున్న మలినాలను, డాగులను తొలగించే సౌందర్య సాధనంగా ఉపయోగపడుతోంది. బొగ్గును ఒంటికి పూసుకుంటే తెల్లగా మారతామనేది నమ్మశక్యంకాని విషయమే అయినా యాక్టివేటెడ్‌ చార్కోల్‌కు అంతటి ప్రభావముందని పరిశోధకులు కనిపెట్టారు. బొగ్గు దాని బరువు కంటే 100-200 పాళ్లు ఎక్కువగా చర్మంలోని మలినాలను తొలగించగలదు. కాబట్టే ఫేసియల్‌ క్లీన్సర్‌గా, మాస్క్‌గా యాక్టివేటెడ్‌ చార్కోల్‌ను ఉపయోగించి చక్కటి ఫలితాన్ని పొందుతున్నారు.
కాఫీతో కళ్లు చెదిరే అందం
సౌందర్య సాధనాల తయారీలో కాఫీని విభిన్న రూపాల్లో ఉపయోగిస్తారు. ఒక్కో రూపానికి ఒక్కో ప్రభావం ఉంటుంది. కాఫీ పండులో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. చర్మంపై ముడతలు, సన్నని గీతలు, మచ్చలు తొలగిపోయేలా కాలుష్యం, సూర్యరశ్మి వల్ల తలెత్తే ఫ్రీర్యాడికల్స్‌తో పోరాడి కొత్త చర్మ కణాల ఉత్పత్తికి యాంటీఆక్సిడెంట్లు దోహదపడతాయి. అలాగే లిప్‌స్టిక్‌ పెదవులపై తేలికగా పరుచుకోవటం కోసం కాఫీ అరేబికాను ఉపయోగిస్తారు. ఫ్రీ రాడికల్స్‌ తొలగిపోయి చర్మం నునుపుగా తయారవ్వటం కోసం క్లీనర్లు, క్రీముల తయారీలో కాఫీ పండును ఉపయోగిస్తారు. సూర్యరశ్మిలోని అతినీలలోహిత కిరణాల వల్ల జరిగిన డ్యామేజిని రిపేర్‌ చేయటం కోసం యాసి్ట్రంజెంట్‌ గుణాలుండే గ్రీన్‌ కాఫీ విత్తనాల ఎక్స్‌ట్రాక్ట్‌ను ఉపయోగిస్తారు. 
కాక్టస్‌తో కావసినంత సౌందర్యం
పెరట్లో కాక్టస్‌ పెరిగితే పీకి అవతల పారేస్తాం. కానీ ఎందుకూ పనికిరాదనుకున్న ఈ మొక్కలో బోలెడన్ని సౌందర్య పోషకాలున్నాయని పరిశోధనలో తేలింది. చర్మంపై గీతలు, ముడతల్ని నియంత్రించే యాంటీఆక్సిడెంట్‌ గుణాలు కాక్టస్‌ పువ్వులో పుష్కలంగా ఉంటాయి. చర్మపు సహజ మృదుత్వాన్ని నిలిపి ఉంచే గుణాలు కూడా కాక్టస్‌ పువ్వులో ఉంటాయి. కాబట్టి మాయిశ్చరైజర్లతోపాటు ఫేస్‌వాష్‌, బాడీ బటర్స్‌, లిప్‌ బామ్స్‌ తయారీలో కూడా కాక్టస్‌ను ఉపయోగిస్తున్నారు. 
పిట్ట రెట్టలు, చేప పొలుసులు
సౌందర్య ఉత్పత్తులకు మెరుపును జోడించటం కోసం చేప పొలుసులు, కొన్ని రకాల పిట్టల రెట్టలను ఉపయోగిస్తారు. ఐ షాడోలు, నెయిల్‌ పాలిష్‌ల మెరుపుకు వీటిలో ఉండే క్రిస్టలీన్‌ గ్వినైన్‌ కారణం. జాపాన్‌లో నైటింగేల్‌ పిట్టల రెట్టలతో ఫేసియల్స్‌ బాగా ప్రాచుర్యం పొందాయి. ఈ ఫేసియల్‌తో చర్మం మచ్చలు తొలగి వెలుగులీనడమే కారణం. 
ఎద్దు వీర్యంతో శిరోజాల సౌందర్యం
వినటానికి ఆశ్చర్యంగా ఎద్దు వీర్యాన్ని శిరోజ సౌందర్యం కోసం ఉపయోగిస్తున్నారనేది నిజం. లండన్‌లోని ఓ హైఎండ్‌ సెలూన్‌ ఎద్దు వీర్యాన్ని ఏకంగా ‘శిరోజాల వయాగ్రా’గా అభివర్ణించింది. అత్యంత ఎక్కువ ప్రొటీన్‌ కలిగి ఉండే ఎద్దు వీర్యాన్ని కటేరా అనే మొక్కతో కలిపి హెయిర్‌ ట్రీట్‌మెంట్‌ చేస్తారు. దీని వల్ల పొడిబారి, డ్యామేజీ అయిన జుట్టు తిరిగి జీవం పోసుకుంటుంది.