ఆమె అందానికి ప్రపంచం దాసోహమైపోయింది. ఆ దక్షినాది అందగత్తె హాలీవుడ్ లో జల్సా చేసింది. ఇప్పుడు ఇంటర్నేషనల్ వేదికపై మరోసారి తళుక్కున మెరిసింది. ఇండియన్ బ్యూటీ ఐశ్వర్యరాయ్ 67వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మెరిసిపోయింది. ఆ ఈవెంట్ లో ఐష్ గోల్డ్ కలర్ గౌను వేసుకుని ఏంజిల్‌లా దర్శనమిచ్చింది. ఆ పోతపోసిన అందాన్ని ప్రేక్షకులు అలాగే కళ్లప్పగించి చూస్తూ ఉండిపోయారు. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఐశ్వర్యరాయ్ బాగా లావెక్కిందనే విమర్శలు ఎదుర్కొంది. ఆ విమర్శలకు ఐష్ చెక్ పెట్టేసింది. స్లిమ్ గా తయారై అందర్నీ ఆశ్చర్య పరిచింది.
2014 కాన్స్ రెడ్ కార్పెట్‌పై ఐష్ ఊహించిన దానికంటే ఎక్కువ అందంగా కనిపించి చూసేవారి మతులుపోగొట్టింది. ఫిల్మ్ ఫెస్టివల్‌లో భాగంగా ఫ్లయింగ్ కిస్ ట్రయల్ కూడా నిర్వహిస్తుంటారు. ఈ సందర్భంగా ఐశ్వర్యరాయ్ వదిలేసిన ఫ్లయింగ్ కిస్‌కు అంతా ముగ్దులైపోయారు. దీంతో ఐష్ రీఎంట్రీ అదిరిపోబోతోందని బాలీవుడ్ అంచనా వేస్తోంది. అభిమానులు ఐశ్వర్యరాయ్ రీఎంట్రీ ఎప్పుడా ఎప్పుడా అని ఎదురుచూస్తున్నారు.
శ్రీదేవి, మాధురీదీక్షిత్ తర్వాత మళ్లీ అంతటి స్టార్‌డమ్‌ని బాలీవుడ్ తెరపై చవిచూసిన తార ఐశ్వర్యా రాయ్. పెళ్లి చేసుకొని ఐశ్వర్య తెరకు దూరమవ్వడం జీర్ణించుకోలేని అభిమానులు లక్షల్లోనే ఉన్నారంటే అతిశయోక్తి కాదు. వెండితెరపై విశ్వసుందరి సాక్షాత్కారం మళ్లీ ఎప్పుడా..! అని ఎదురు చూస్తున్న అభిమానులకు తాజాగా ఓ తీయని కబురు చెప్పారు ఐశ్వర్య. ఇటీవల ఆమె 41వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా తన గురించి పలు ఆసక్తికరమైన విషయాలు ఐశ్వర్య మాటల్లోనే.
గత శనివారం నవంబర్ 1న జరిగిన నా పుట్టిన రోజు... నాకు ఎప్పటికీ మరచిపోలేని జ్ఞాపకంలా మిగిలిపోతుంది. ఊహ తెలిసినప్పట్నుంచీ ఇంత ఘనంగా నేనెప్పుడూ పుట్టినరోజు జరుపుకోలేదు. రేపు నా పుట్టిన రోజు అనగా... ముందు రోజు రాత్రి నుంచే అతిథులు, శ్రేయోభిలాషులు మా ఇంటికి రావడం మొదలుపెట్టారు. నా ముద్దుల కూతురు ఆరాధ్య ముద్దు ముద్దుగా హ్యాపీ బర్త్‌డే చెప్పడం ఓ మర్చిపోలేని అనుభూతి. ఒకవైపు ఫోన్లలో శుభాకాంక్షలు. దీని వల్ల ముందు రోజు రాత్రి నుంచే నాకు నిద్ర లేదు. ఇక తెల్లారగానే జరిగే హడావిడి గురించి ప్రత్యేకించి చెప్పాలా? క్షణం తీరిక లేకుండా పోయింది. మొత్తంగా 24 గంటలు నిద్ర లేకుండా బిజీగా గడిపాను.
ఘనంగా ఆరాధ్య పుట్టినరోజు...
ఈ నెల 16న మా ఆరాధ్య పుట్టిన రోజు. గత ఏడాది తన పుట్టిన రోజును చాలా ఘనంగా చేశాను. దాదాపు ఓ పెళ్లి చేసినంత వైభవంగా ఆ వేడుక జరిపాను. ఈ ఏడాది కూడా చాలా ఘనంగా జరపాలనుకుంటున్నాను. దానికి బలమైన కారణమే ఉంది. గత ఏడాది ఆరాధ్య పుట్టిన రోజు ఎంత ఘనంగా జరిపినా... తెలుసుకునేంత వయసు తనకు లేదు. కానీ ఇప్పుడు తన పుట్టిన రోజు కోసం ఆరాధ్య ఎదురు చూస్తోంది. పుట్టినరోజు వేడుకను ఎంజాయ్ చేసేంత వయసు వచ్చింది. అందుకే స్పెషల్‌గా ప్లాన్ చేయాలనుకుంటున్నా.
2015 బిజీ బిజీ
‘గుజారిష్’ తర్వాత నేను సినిమా చేయలేదు. అడపాదడపా వాణిజ్య ప్రకటనల్లో నటించినా... సినిమాల్లో నటించి నాలుగేళ్లు కావొస్తోంది. ఇంట్లో వాళ్లు కూడా నేను నటిగా కొనసాగడానికి అభ్యంతరం చెప్పడంలేదు. అందుకే... సంజయ్ గుప్తా కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాను. ‘జాజ్బా’ టైటిల్‌తో రూపొందనున్న ఈ చిత్రం జనవరిలో సెట్స్‌కి వెళ్తుంది. ఇది కాక ఇంకా కొన్ని కథలు విన్నాను. వాటిల్లో కూడా కొన్నింటికి ‘ఓకే’ చెప్పబోతున్నాను. ఏదేమైనా 2015లో మాత్రం నేను బిజీ బిజీ. ఇంత విరామం తర్వాత మళ్లీ బిజీ అవుతున్నందుకు ఎగ్జయిటింగ్‌గా ఉంది.


